Friday, April 1, 2011

'శక్తి'


చిత్రం:'శక్తి'
నటీనటులు: ఎన్‌.టి.ఆర్, ఇలియానా, సోనూసూద్‌, ప్రభు, మంజరి, జాకీష్రాఫ్‌, పూజాబేడీ, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్‌ తదితరులు..
సంగీతం: మణిశర్మ,
నిర్మాత: సి. అశ్వనీదత్‌,
దర్శకత్వం: మెహర్‌ రమేష్‌.

పాయింట్‌: దైవశక్తి, యువకుని "శక్తి"లో కలిస్తే ఏం సాధించవచ్చనేది కథ.

చిత్రం గురించి చెప్పాలంటే అశ్వనీదత్‌ గురించి చెప్పక తప్పదు. కాంబినేషన్‌లను క్యాష్‌ చేసుకోవడంలో దిట్టయిన సి. అశ్వనీదత్‌ బేనర్‌ వైజయంతి మూవీస్‌ నుంచి వచ్చిన చిత్రమిది. సినిమా షూటింగ్‌ నుంచి విడుదలయ్యే వరకు కనీసం మీడియాకు కూడా వివరాలు తెలియజేయకుండా, వ్యాపారం కోసమే ఏదో చిన్నపాయింట్‌ విడుదల చేసి రకరకాల కథనాలు అల్లుకోండని చెప్పే అశ్వనీదత్‌ నిజంగా ధైర్యవంతుడే.

ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే.. ఆయన అమితంగా ఆరాధించే స్వామీజీల గురించి చెప్పాలి. హైదరాబాద్‌ శివార్లలో ప్రముఖ స్వామీజీ చెప్పిన పాయింట్‌తో ఈ కథ నిర్మాణం దాల్చుకుంది. చిత్రం సెన్సార్‌ అయిన తర్వాత మొట్టమొదటగా ఆయన పాదపద్మాలవద్దే బాక్స్‌ను ఉంచి ఆశీస్సులు పొందారు.

కథ: అష్టాదశ శక్తిపీఠాల నేపథ్యంలో సాగే కథ ఇది. దుష్టశక్తులు మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తాయి. అలాంటివారిని దైవ సంకల్పంగల శక్తి (ఎన్టీఆర్‌) ఎలా ఎదుర్కొన్నాడు... అన్నది కథ. భారతదేశంలో శక్తిపీఠాలను అనుసంధానంచేసే బ్రహ్మపీఠం ఉంది. అందులోని అమ్మవారి త్రిశూలాన్ని దక్కించుకుంటే అద్భుతమైన యోగం, శక్తియుక్తులు దక్కుతాయని నమ్మకం. విషయం తెలిసిన ఈజిప్టులోని దుష్టశక్తులు సోనూసూద్‌, పూజాబేడీలు ఇండియా వస్తారు.

ఇక్కడ అమ్మవారిని రక్షించే వంశం ఉందని తెలుసుకుంటారు. రక్షిస్తున్న వారిలో ఒకడు రుద్ర (ఎన్‌.టి.ఆర్‌.). ఓ సందర్భంలో దుష్టశక్తుల్ని ఎదుర్కొని చనిపోతాడు. కట్‌చేస్తే... 27 ఏళ్ళ తర్వాత కథ. ఆ రుద్ర కొడుకే శక్తి (ఎన్‌.టి.ఆర్‌). కేంద్రమంత్రి ప్రభుకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉంటాడు. అతని కుమార్తె ఇలియానాను కాపాడే ప్రయత్నంలో తన పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటాడు. తన తండ్రి మిగిల్చిన పనిని తానుచేసి అమ్మవారి కృప ఎలా పొందాడన్నది సినిమా.

ఎన్‌.టి.ఆర్‌. నటన గురించి చెపాల్సిన పనిలేదు. ఆవేశం, రౌద్రం, కొంటెతనం అన్నీ సమపాళ్ళలో చేశాడు. రుద్రగా అతని గెటప్‌లో లోపాలున్నాయి. ఆ పాత్ర తీర్చిన విధానం కుదరలేదు. ఇలియానా పాత్ర మేరకే నటించినా గ్లామర్‌గాళ్‌గా అలరించింది. ఇలియానా తండ్రిగా ప్రభు నటించాడు. అతని తండ్రిగా ఎస్‌.పిబాల సుబ్రహ్మణ్యం ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌‌లో కన్పిస్తాడు. ఇక మిగిలిన పాత్రలు కథ మేరకే సాగుతాయి. సోనూసూద్‌ మరోసారి తన పాత్రలో జీవించాడు. కామెడీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు.

చిత్రానికి మణిశర్మ సంగీతం పెద్దగా ఉపయోడలేదు. చెప్పుకోదగిన పాటలు లేవు. కెమెరా పనితం శక్తిపీఠాల సమయంలో చిత్రించిన విధానంతోపాటు గ్రాఫిక్స్‌ బాగున్నాయి. ఆ సన్నివేశాలు చూస్తుంటే... అంజి, మగధీర సన్నివేశాలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఫైట్స్‌, డాన్సులూ, డైలాగ్‌లు సోసోగానే ఉన్నాయి. ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఇంకాస్త పటిష్టంగా ఉంటే కథ మరోలా ఉండేది.

ఎటువంటి కథలకైనా స్క్రీన్‌ప్లే కీలకం. అది రొటీన్‌ చిత్రాలమాదిరిగానే తీస్తే కష్టమే. క్లైమాక్స్‌లో ఎదుర్కొనే సన్నివేశాలు గగుర్పాటు కల్గించినా... సామాన్య ప్రేక్షకుడికి ఈ శక్తిపీఠాల గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో.. కథ పాయింట్‌ వీక్‌గా అనిపిస్తుంది. భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన ఈ చిత్రం ఎంతమేరకు నిలుస్తుందో చూడాలి.

0 comments:

Post a Comment

VENNELA KUMAR

Followers